న్యూజిలాండ్‌లో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయ వ్యక్తి మృతి!

  • న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతి వ్యక్తి దుర్మరణం
  • ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రమణ్‌దీప్ ధిల్లాన్ 
  • మృతుడికి భార్య, ఏడాది వయసున్న కూతురు 
  • 2015లో న్యూజిలాండ్ వెళ్లిన‌ పంజాబ్‌కు చెందిన మృతుడు 
  • బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు భారీగా విరాళాల సేకరణ
ఉపాధి కోసం సముద్రాలు దాటి వెళ్లిన ఓ భారతీయ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. న్యూజిలాండ్‌లో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న పంజాబ్‌కు చెందిన వ్యక్తి ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనతో ఆయన భార్య, ఏడాది వయసున్న కూతురు ఒంటరివారయ్యారు.

వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన రమణ్‌దీప్ ధిల్లాన్ (36) న్యూజిలాండ్‌లోని పాపమోవాలో నివసిస్తున్నారు. గత బుధవారం రాత్రి 7:15 గంటల సమయంలో టె ప్యూక్ హైవేపై ఉబర్ ట్రిప్‌లో ఉండగా ఆయన ప్రయాణిస్తున్న కారు, మరో వాహనం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రమణ్‌దీప్ అక్కడికక్కడే మృతి చెందగా, రెండో వాహనంలోని ఇద్దరు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు.

న్యూజిలాండ్ హెరాల్డ్ కథనం ప్రకారం రమణ్‌దీప్ 2015లో స్టూడెంట్ వీసాపై న్యూజిలాండ్‌కు వెళ్లారు. 2024లో స్వదేశానికి వచ్చి వీర్‌పాల్ కౌర్‌ను వివాహం చేసుకుని, ఆమెను కూడా తనతోపాటు న్యూజిలాండ్‌కు తీసుకెళ్లారు. మొదట్లో ఇద్దరూ కివీ పండ్ల తోటల్లో పనిచేసేవారు. వారికి కుద్రత్ అనే కూతురు పుట్టిన తర్వాత పాప ఆలనాపాలనా చూసుకునేందుకు వీలుగా ఉంటుందని రమణ్‌దీప్ ఉబర్ డ్రైవర్‌గా మారారు.

ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం పనికి వెళ్లే ముందు.. "రాత్రి డిన్నర్‌కు తిరిగి వస్తాను" అని తనతో చెప్పి వెళ్లాడని భార్య కౌర్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తర్వాత ఆయన ఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాలేదని, అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి తన భర్త మరణవార్తను చెప్పడంతో ఒక్క‌సారిగా గుండె ఆగినంత‌ప‌నైంద‌ని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "అతను చాలా మంచివాడు, అమాయకుడు, నమ్మకస్తుడు. నా కోసం అన్నీ చేశాడు. అతని ప్రేమను నేను మర్చిపోలేను" అని ఆమె విలపించారు.

తమ కూతురు కుద్రత్ తన తండ్రి కోసం అడుగుతోందని, ఆ పాప నవ్వు అచ్చం తన తండ్రిలాగే ఉంటుందని ఆమె అన్నారు. బుధవారం జరిగిన రమణ్‌దీప్ అంత్యక్రియలకు న్యూజిలాండ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు 'గివ్‌ఎలిటిల్' పేజీ ద్వారా విరాళాల సేకరణ చేపట్టగా, ఇప్పటివరకు 33,000 డాలర్లకు పైగా (సుమారు రూ. 27 లక్షలు) సేకరించారు. ఈ మొత్తాన్ని అంత్యక్రియల ఖర్చులు, ఇంటి అద్దె, కుటుంబ పోషణకు వినియోగించనున్నారు.

Ramandeep Dhillon
New Zealand
Uber driver
Road accident
Punjabi community
Givealittle
Veerpal Kaur
Kudrat
Kiwi fruit farm
Papamoa

More Telugu News